సాయి సయంతిక టీవీ, విశాఖపట్నం :- దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద అర్బన్ బ్యాంకు గా రూపాంతరం చెందుతున్న విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ 60వ శాఖను విశాఖ నగర పరిధి ఎండాడలో ఏర్పాటు చేయనున్నట్లు బ్యాంకు చైర్మన్ జేవి సత్యనారాయణమూర్తి తెలిపారు.
సమాజంలో కోటీశ్వరుల జాబితా పెరుగుతుంటే మరోవైపు సామాన్యుల ఆర్థిక స్థితిగతులు రోజురోజుకు దిగజారడం ఆందోళన కలిగిస్తుందన్నారు. సమాజంలో రోజురోజుకు పెరుగుతున్న ఆర్థిక అంతరాల తగ్గింపునకు సహకార వ్యవస్థ బలోపేతమే పరిష్కారం మార్గమని ఆయన అన్నారు. పేద మధ్యతరగతి వర్గ ప్రజల ఆర్థిక అవసరాలకు సహకార అర్బన్ బ్యాంకులు బాసటగా నిలుస్తాయి అన్నారు. 1916లో కార్యకలాపాలు ప్రారంభించిన ది విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ నేడు తెలుగు రాష్ట్రాల్లో 59 శాఖల ద్వారా బహుళ రాష్ట్రాల అర్బన్ బ్యాంకు గా ప్రజలకు సేవలు అందిస్తుంది అన్నారు. జాతీయ బ్యాంకుల మాదిరిగానే తమ బ్యాంకులో కూడా అన్ని రకాల సేవలు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. తమ బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించని మొండి బకాయి దారులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.





