సాయి సయంతిక టీవీ, అమరవతి :- ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమిగా కొనసాగుతూనే మూడు పార్టీలు సొంతంగా బలం పెంచుకోవటం పైన కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. వైసీపీ లక్ష్యం గా ముందుకు వెళ్తున్నాయి. అటు జగన్ సైతం కూటమి పైన గురి పెట్టారు. ఇదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ పార్టీని బలోపేతం కోసం కొత్త ఆలోచనలు చేస్తున్నారు. అందులో భాగంగా గతంలో పార్టీ నుంచి బయటకు వెళ్లిన ముఖ్యులను తిరిగి వస్తే ఆహ్వానించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు పార్టీలో మాజీ జేడీ లక్ష్మీనారాయణ పై చర్చ మొదలైంది.
పవన్ నిర్ణయం
డిప్యూటీ సీఎం పవన్ పార్టీ పైన ఫోకస్ చేసారు. ఎమ్మెల్యేల పని తీరు పైన క్షేత్ర స్థాయి నివేదికలు కోరిన పవన్.. వస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టేలా నిర్ణయాలకు సిద్దం అవుతున్నారు. పూర్తి స్థాయి లో ఇక పాలనా పరమైన వ్యవహారాలు.. పార్టీకి సమయం కేటాయించాలని డిసైడ్ అయ్యారు. పార్టీ సభ్యత్వం పైన కసరత్తు జరుగుతోంది. వచ్చే నెలలో పార్టీ పీఏసీ సమావేశం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇదే సమయంలో పార్టీలో చేరికల విషయంలోనూ పవన్ ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా గతంలో పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించి.. బయటకు వెళ్లిన వారు తిరిగి వస్తే అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తిరిగి జనసేనలోకి వస్తారనే ప్రచారం పార్టీ నేతల్లో జరుగుతోంది.
మాజీ జేడీ రీ ఎంట్రీ..?
జగన్ కేసులు విచారణ.. అరెస్ట్ లో కీలకంగా వ్యవహరించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ 2019 ఎన్నికల్లో జనసేన నుంచి విశాఖ ఎంపీగా పోటీ చేసారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తరువాత కొంత కాలానికి జనసేన వీడారు. 2024 ఎన్నికల ముందు కొత్తగా పార్టీ ఏర్పాటు చేసినా సక్సెస్ కాలేకపోయారు. స్వచ్చందంగా పలు అంశాల పైన మాజీ జేడీ స్పందిస్తున్నారు. ఇక, ఇప్పుడు ఒక టీవీ చర్చలో మాజీ జేడీ కీలక వ్యాఖ్యలు చేసారు. పవన్ రాజకీయంగా – పాలనా పరంగా తీసుకుంటున్న నిర్ణయాలను అభినందించారు. పవన్ రాజకీయంగా ఎదుగుతూ 2024 ఎన్నికల్లో గెలిచిన తీరును ప్రశంసించారు. తనకు జనసేన నేతలు ఇప్పటికీ టచ్ లో ఉన్నారని చెప్పుకొచ్చారు. తనకు విశాఖలో పోటీ చేసిన సమయంలో జనసేన వీరమహిళలు, జనసైనికులు మద్దతుగా నిలిచారని..వారిని ఎప్పటికీ మర్చిపోలేనని మాజీ జేడీ పేర్కొన్నారు.
క్రియాశీలక బాధ్యతలు
రాష్ట్రంలో పవన్ వైపు ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారని లక్ష్మీనారాయణ చెప్పారు. ప్రతిపక్షం లేనప్పుడు ఎవరో ఒకరు ప్రజా పక్షాన నిలబడాలని.. జగన్ అసెంబ్లీకి రావటం లేదని.. దీంతో, ఆ పాత్ర పవన్ పోషించాలని సూచించారు. అమరావతిలో రెండో విడత భూ సేకరణ పై పవన్ అభ్యంతరాలు చెప్పినట్లుగా వచ్చిన వార్తలను ప్రస్తావించారు. పవన్ గిరిజనులు, గ్రామీణ ప్రజల కోసం తీసుకుంటున్న నిర్ణయాలు.. సమస్యలతో వచ్చిన వారితో మమేకం అవుతున్న తీరును జేడీ ప్రత్యేకంగా అభినందించారు. అయితే, తన రాజకీయ ప్రయాణం పైన నేరుగా స్పష్టత ఇవ్వక పోయినా.. రాజకీయాల్లో పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయని పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్లు విశ్లేషణలు వస్తున్నాయి. కొద్ది రోజులుగా జనసేన ముఖ్యుల్లోనూ జేడీ రీఎంట్రీ గురించి చర్చ జరుగుతోంది. దీంతో.. జేడీ పార్టీలోకి తిరిగి వస్తే కీలక బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ జరుగుతున్న వేళ.. జేడీ తన నిర్ణయం పైన అధికారికంగా స్పష్టత ఇవ్వాల్సి ఉంది.