సాయి సయంతిక టీవీ, శ్రీకాకుళం :- ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి పార్టీల్లోనూ కొత్త లెక్కలు మొదలయ్యాయి. ఏడాది పాలన పైన టీడీపీ శ్రేణులు ప్రజల మధ్యలోకి వెళ్తున్నాయి. జనసేన, బీజేపీ నేతలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఇటు జగన్.. కూటమి హామీల విస్మరణ పైన తన పార్టీ నేతలను జనంలోకి పంపారు. కాగా.. జగన్ జిల్లాల పర్యటనలకు సిద్దం అవుతున్న వేళ ఉత్తరాంధ్ర పార్టీ సీనియర్ నేత గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవటం సంచలనంగా మారుతోంది.
పార్టీకి దూరంగా
వైసీపీ 2024 ఎన్నికల్లో ఓడిన తరువాత పలువురు ముఖ్య నేతలు పార్టీ వీడారు. ఆ తరువాత వైసీపీ నుంచి వలసలు ఆగాయి. తాజాగా రాయలసీమకు చెందిన టీడీపీ సీనియర్ నేత సుగవాసి బాల సుబ్రహ్మణ్యం వైసీపీ కండువా కప్పుకున్నారు. ఏడాది కాలంలోనే కూటమి ప్రభుత్వం పైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని జగన్ చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏడాదిలో సాధించిన విజయాల పైన వివరించేందుకు టీడీపీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లారు. దీనికి కౌంటర్ గా వైసీపీ సైతం హామీలను అమలు చేయలేదంటూ సీఎం చంద్రబాబు లక్ష్యంగా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కాగా, ఇదే సమయంలో ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ నేత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం ఇప్పుడు వైసీపీలో భిన్నాభిప్రాయాలకు కారణమవుతోంది.
ధర్మాన నిర్ణయం వెనుక
మాజీ మంత్రి.. శ్రీకాకుళం సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు నిర్ణయం ఏంటనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది. జిల్లాలో సీనియర్ పొలిటీషియన్ గా ఉన్నారు. కాంగ్రెస్.. ఆ తరువాత వైసీపీ లోనూ పెద్ద దిక్కుగా వ్యవహరించారు. 1989 లో, 2004-2014 వరకు మంత్రిగా పని చేసిన ధర్మానకు 2019లో జగన్ కేబినెట్ లోనూ అవకాశం వచ్చింది. ధర్మాన సోదరుడు క్రిష్ణదాస్ మాత్రం పార్టీలో క్రియాశీలకంగానే ఉన్నారు. ధర్మాన సోదరులు ఇద్దరూ జగన్ మంత్రివర్గంలో పని చేసారు. కాగా.. పార్టీ ఓడిన తరువాత ధర్మాన పూర్తిగా వైసీపీ వ్యవహారాలకు దూరం అయ్యారు. ధర్మాన జనసేనలో చేరుతారని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అయితే, ఆయన ఇప్పటి వరకు అధికారికంగా ఆ ప్రచారం పైన స్పష్టత ఇవ్వలేదు.
కుమారుడు కోసం
అయితే, ధర్మాన 2024 ఎన్నికలకు ముందే జగన్ ను కలిసి తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని.. తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే, 2024 ఎన్నికల వరకు పోటీ చేయాలని జగన్ సూచన మేరకు బరిలో నిలిచారు. ఎన్నికల్లో ఓడిన తరువాత రాజకీయాల కు దూరంగా ఉంటున్నారు. తాజాగా శ్రీకాకుళంలో నిర్వహించిన వైసీపీ జిల్లా సమావేశానికి ధర్మాన ప్రసాదరావు డుమ్మా కొట్టారు. ఏడాదిగా పార్టీ కార్యక్రమాలకు హాజరుకావడం లేదు. గురువారం కూడా శ్రీకాకుళంలోనే అందుబాటులో ఉన్నప్పటికీ జిల్లాస్థాయి సమావేశానికి ముఖం చాటేశారని చెబుతున్నారు. అయితే.. తన కుమారుడికి రాజకీయ భవిష్యత్ కోసం తాను తప్పుకోవాలని ధర్మాన భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ధర్మాన వైసీపీకి దూరం అవుతున్నారా.. లేక, పూర్తి గా రాజకీయాలకే గుడ్ బై చెబుతారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. వచ్చే ఎన్నికల్లో ధర్మాన కుమారుడు పోటీ చేస్తారని చెబుతున్నా, ఏ పార్టీ అనేది సస్పెన్స్ గా మారుతోంది.