సాయి సయంతిక టీవీ, రాజస్థాన్ :- ఒక 75 ఏళ్ల వృద్ధడిపై ఒక బస్ కండక్టర్ దాడి చేశాడు. పైగా ఆ వృద్ధుడు ఒక రిటైర్డ్ ఐఎస్ అధికారి. ఈ గొడవంతా కేవలం రూ.10 కోసమే. బస్సులో కూర్చొన్న రిటైర్డ్ అధికారి ఒక బస్ స్టాప్ ముందు వరకు వచ్చేయడంతో బస్ కండక్టర్ వయో వృద్ధుడు అని కూడా చూడకుండా దురుసుగా వ్యవహరించాడు. దీంతో ఆ రిటైర్డ్ అధికారి కూడా తిరిగి ఒక చెంపదెబ్బ కొట్టాడు. దీంతో యువకుడైన ఆ బస్ కండక్టర్ ఎదురు దాడి చేశాడు. అక్కడ కూర్చున్న ఓ వ్యక్తి ఈ ఘటన వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఇప్పుడా వీడియో బాగా వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ నగరంలో ఒక రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఆర్ ఎల్ మీనా గత శుక్రవారం ఒక సిటీ బస్సు ఎక్కాడు. ఆ బస్సులో యువకుడైన ఘన్శ్యామ్ శర్మ కండక్టర్ గా ఉన్నాడు. అయితే 75 ఏళ్ల ఐఎఎస్ మీనా బస్సులో ఎక్కి టికెట్ తీసుకున్నారు. కానీ తను దిగే బస్ట స్టాప్ వచ్చే ముందు తనకు తెలియజేయాలని ఆ బస్ కండక్టర్ ని కోరారు.
ఆ తరువాత పెద్దమనిషి దిగాల్సిన బస్ స్టాప్ వచ్చినా ఆ బస్ కండక్టర్ చెప్పలేదు. దీంతో ఐఎఎస్ మీనా అలాగే కూర్చోనుండి పోయారు. కానీ కాసేపు తరువాత బస్ కండక్టర్ ఘనశ్యామ్ ఆయన వద్దకు వచ్చి.. మీరు దిగాల్సిన బస్ స్టాప్ దాటిపోయింది. ఇకముందు వచ్చే బస్ట్ స్టాప్ లో దిగండి అని చెప్పాడు. చేసేది లేక ఆ పెద్ద మనిషి తదుపరి బస్ స్టాప్ లో బస్సు ఆగినప్పుడు దిగబోయాడు. కానీ బస్ కండక్టర్ ఘన్ శ్యామ్ మాత్రం ఆయనను ఆపి ఒక స్టాప్ ముందు వరకు వచ్చారు కాబట్టి.. రూ.10 ఎక్కువ ఇవ్వాలని అడిగాడు. దాంతో ఆ పెద్ద మనిషి.. తన తప్పేమీ లేదని రూ.10 ఎక్కువ ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించాడు.
కానీ కండక్టర్ ఘన్ శ్యామ్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. ఆ పెద్దమనిషి తన వద్ద మరో రూ.10 లేవని చెప్పినా కండక్టర్ ఘన్ శ్యామ్ వినలేదు. ఇంతలోనే ఆ కండక్టర్ పెద్దమనిషిని నెట్టాడు. ఈ కారణంగా ఐఎఎస్ మీనా బస్ కండక్టర్ ని లాగి ఒక చెంపదెబ్బ కొట్టారు. ఇక అంతే యువకుడైన ఆ బస్ కండక్డర్ వృద్ధుడని గౌరవం లేకుండా ఎడా పెడా పట్టుకొని కొట్టేశాడు. ఇదంతా జరుగుతుండగా కాసేపు అక్కడున్న వారంతా కూర్చొని చూస్తుండిపోయారు. ఒక వ్యక్తి అయితే ఈ ఘటనని తన ఫోన్ లో రికార్డ్ చేశాడు.
కాసేపు తరువాత బస్సులో కొంతమంది కలుగజేసుకొని ఆ పెద్ద మనిషిని కాపాడి.. ఆగ్రా రోడ్డు లోని కనోటా బస్ట్ స్టాప్ వద్ద దింపేశారు. తనపై దాడి జరిగిందని ఐఎఎస్ మీనా సమీపంలోని కనోటా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని పోలీసులు జైపూర్ సిటీ ట్రాన్స్ పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ యాజమాన్యానికి తెలియజేశారు. దీంతో బస్ కండక్టర్ ఘన్ శ్యామ్ ని సస్పెండ్ చేయడం జరిగింది. ఐఎఎస్ మీనా ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.